logo

Sports

చైనా చిక్కితే అందలమే!

...

 

ప్రపంచ నంబర్‌వన్‌కు శ్రీకాంత్‌ చేరువయ్యాడు. గురువారం రెండో ర్యాంకుకు చేరుకున్న శ్రీకాంత్‌ (73,403)కు.. నంబర్‌వన్‌ స్థానంలో ఉన్న విక్టర్‌ అక్సెల్సెన్‌ (77,930- డెన్మార్క్‌)కు తేడా 4527 పాయింట్లు మాత్రమే. ఈ ఏడాది ఇంకో మూడు సూపర్‌ సిరీస్‌లు మిగిలే ఉన్నాయి. అందులో మొదట జరిగే చైనా ఓపెన్‌ నెగ్గితే శ్రీకాంత్‌కు నంబర్‌వన్‌ ర్యాంకు ఖాయమే. ఈనెల 14 నుంచి 19 వరకు చైనా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ ప్రిమియర్‌ టోర్నీ జరుగనుంది. ఈ టైటిల్‌ నెగ్గితే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా నంబర్‌వన్‌ ర్యాంకు శ్రీకాంత్‌ సొంతమవుతుంది. ఒకవేళ ఫైనల్లో ఓడినా శ్రీకాంత్‌ ఒకటో ర్యాంకు సాధించొచ్చు. కాకపోతే ప్రస్తుతం నంబర్‌వన్‌గా ఉన్న విక్టర్‌.. సెమీస్‌లోనే ఓడిపోవాలి. ఒకవేళ చైనా ఓపెన్‌లో ప్రారంభ రౌండ్లలోనే శ్రీకాంత్‌ ఓడినా నష్టమేమీ లేదు. హాంకాంగ్‌ ఓపెన్‌, బీడబ్ల్యూఎఫ్‌ సూపర్‌ సిరీస్‌లలో సత్తాచాటితే శ్రీకాంత్‌ ర్యాంకు మెరుగవుతుంది. వరుసగా చైనా ఓపెన్‌, హాంకాంగ్‌ ఓపెన్‌లలో విఫలమైనా.. డిసెంబరులో జరిగే సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌ శ్రీకాంత్‌కు సువర్ణావకాశమే. ఈ టోర్నీలో విక్టర్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలో దిగనున్నాడు. అంటే.. విక్టర్‌ టైటిల్‌ నిలబెట్టుకోకపోతే అతని పాయింట్లలో కోత పడుతుంది. అదే సమయంలో గత ఏడాది ఈ టోర్నీలో ఆడలేదు కాబట్టి శ్రీకాంత్‌కు పోయేదేమీ లేదు. సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌లో శ్రీకాంత్‌ ముందుకెళ్ళేకొద్దీ నంబర్‌వన్‌ ర్యాంకు అతనికి మరింత చేరువవుతుందన్నమాట! గత 52 వారాల్లో అత్యుత్తమంగా ఆడిన 10 టోర్నీల ప్రదర్శన ఆధారంగా బీడబ్ల్యూఎఫ్‌ ర్యాంకింగ్స్‌ ఇస్తారు. 1990ల్లో పుల్లెల గోపీచంద్‌ కెరీర్‌లో అత్యుత్తమంగా నాలుగో ర్యాంకు సాధించాడు. 1980లో ప్రకాశ్‌ పదుకొనె నంబర్‌వన్‌ ర్యాంకు కైవసం చేసుకున్నాడు!