logo
రాయుడు నిలిచాడు.. గెలిపించాడు!

...

 

అంబటి రాయుడు (52 నాటౌట్‌; 73 బంతుల్లో 7×4) సత్తాచాటాడు. క్లిష్ట పరిస్థితుల్లో జట్టుకు అండగా నిలిచాడు. తోటి ఆటగాళ్ళు పెవిలియన్‌ బాట పడుతున్నా.. తన అనుభవాన్నంతా ఉపయోగించి జట్టును ఒడ్డుకు చేర్చాడు. రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌కు వరుసగా రెండో విజయాన్ని అందించాడు. సోమవారం ముగిసిన రంజీ ట్రోఫీ గ్రూప్‌-ఎ మ్యాచ్‌లో హైదరాబాద్‌ 4 వికెట్ల తేడాతో అసోంపై గెలుపొందింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రాయుడు ఆఖరి వరకు క్రీజులో నిలిచి జట్టును విజేతగా నిలిపాడు. తడబడిన బ్యాట్స్‌మెన్‌: ఓవర్‌నైట్‌ స్కోరు 300/7తో నాలుగో రోజు ఉదయం ఆట కొనసాగించిన అసోం రెండో ఇన్నింగ్స్‌లో 109 ఓవర్లలో 331 పరుగులకు ఆలౌటైంది. శుక్రవారం ఉదయం మరో 11 ఓవర్లు ఆడిన అసోం 31 పరుగులు జోడించి.. చివరి 3 వికెట్లు కోల్పోయింది. పేసర్లు రవికిరణ్‌ (3/75), సుదీప్‌ త్యాగి (3/34), ముదస్సిర్‌ (2/56) రాణించారు. అనంతరం 142 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన హైదరాబాద్‌ తడబడింది. టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌కు వరుస కట్టారు. ఓపెనర్లు అక్షత్‌రెడ్డి (2), తన్మయ్‌ అగర్వాల్‌ (5) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. దీంతో 8 పరుగులకే హైదరాబాద్‌ ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. కొద్దిసేపటికే ఆల్‌రౌండర్‌ రవితేజ (4) కూడా ఔటయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 18 పరుగులే. ఈ సమయంలో సుమంత్‌ (32; 66 బంతుల్లో 1×4, 1×6), సందీప్‌ (16; 1×4) కొద్దిసేపు క్రీజులో నిలిచారు. సుమంత్‌ అసోం బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టాడు. జట్టు స్కోరు అర్ధ సెంచరీ దాటింది. ఐతే 15 పరుగుల వ్యవధిలో సుమంత్‌, సందీప్‌ ఔటవడంతో హైదరాబాద్‌ ఆత్మరక్షణలో పడింది. 69 పరుగులకే హైదరావాద్‌ 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. అప్పటికి జట్టులో మిగిలిన ప్రధాన బ్యాట్స్‌మన్‌ రాయుడు ఒక్కడే. క్రీజులో కుదురుకున్న రాయుడు.. ఆల్‌రౌండర్‌ ఆకాశ్‌ భండారి (26; 36 బంతుల్లో 1×4, 1×6)తో కలిసి పరుగులు రాబట్టాడు. వీరిద్దరు మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడారు. రాయుడు, ఆకాశ్‌ ధాటిగా ఆడుతూ అసోం బౌలర్లను ఒత్తిడికి గురిచేశారు. చివర్లో ఆకాశ్‌ ఔటైనా అప్పటికే హైదరాబాద్‌ లక్ష్యానికి చేరువైంది. రాయుడు, ఆకాశ్‌ ఆరో వికెట్‌కు 55 పరుగులు జోడించారు. మెహదీ హసన్‌ (4 నాటౌట్‌)తో కలిసి రాయుడు మిగతా పని పూర్తి చేశాడు. ముంచిన జింఖానా!: రంజీ ట్రోఫీలో వరుసగా రెండు విజయాలు సాధించిన ఆనందం కంటే నాకౌట్‌ బెర్తు దూరమైందన్న బాధ హైదరాబాద్‌ అభిమానులది. గ్రూప్‌-ఎలో 15 పాయింట్లతో హైదరాబాద్‌ మూడో స్థానంలో నిలిచినా.. తొలి రెండు స్థానాల్లో ఉన్న కర్ణాటక (26), దిల్లీ (24) క్వార్టర్‌ఫైనల్‌ బెర్తులు సొంతం చేసుకున్నాయి. ఈ సీజన్‌లో హైదరాబాద్‌ ఆడాల్సిన తొలి రెండు మ్యాచ్‌లు రద్దయ్యాయి. అనంతరం కర్ణాటక చేతిలో ఓడగా.. రైల్వేస్‌, అసోంలపై హైదరాబాద్‌ విజయాలు నమోదు చేసింది. ఐతే మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌లతో మొదటి 2 మ్యాచ్‌ల ఫలితాలు హైదరాబాద్‌ నాకౌట్‌ అవకాశాన్ని దెబ్బతీశాయి. ఈ రెండు మ్యాచ్‌లకు జింఖానా మైదానం వేదికగా నిలిచింది. మ్యాచ్‌లకు ముందు వర్షం పడినా.. ఔట్‌ ఫీల్డ్‌ సరిగా లేకపోవడమే రద్దుకు అసలు కారణం. రెండో మ్యాచ్‌ సమయంలో రోజంతా ఎండ కాసినా ఆట సాధ్యం కాలేదు. హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) వైఫల్యానికి ఇప్పుడు హైదరాబాద్‌ జట్టు మూల్యం చెల్లిస్తోంది! హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌: 326 అసోం తొలి ఇన్నింగ్స్‌: 136 అసోం రెండో ఇన్నింగ్స్‌: 331 హైదరాబాద్‌ రెండో ఇన్నింగ్స్‌: తన్మయ్‌ అగర్వాల్‌ (ఎల్బీ) (బి) ఏకే దాస్‌ 5; అక్షత్‌రెడ్డి (ఎల్బీ) (బి) అహ్మద్‌ 2; సుమంత్‌ (సి) రహమాన్‌ (బి) పరాగ్‌ 32; రవితేజ (సి) రహమాన్‌ (బి) ఏకే దాస్‌ 4; సందీప్‌ (సి) పీపీ దాస్‌ (బి) పరాగ్‌ 16; రాయుడు నాటౌట్‌ 52; ఆకాశ్‌ భండారి (ఎల్బీ) (బి) రాహుల్‌సింగ్‌ 26; హసన్‌ నాటౌట్‌ 4; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం: (39 ఓవర్లలో 6 వికెట్లకు) 144 వికెట్ల పతనం: 1-6, 2-8, 3-18, 4-54, 5-69, 6-124 బౌలింగ్‌: ఏకే దాస్‌ 7-0-21-2; అహ్మద్‌ 7-0-23-1; రాహుల్‌సింగ్‌ 12-0-36-1; పీఎల్‌ దాస్‌ 3-0-20-0; పరాగ్‌ 10-2-41-2