logo

హిమగిరుల్లో ఎన్నికల వేడి



సిమ్లా: మంచు పర్వతాల్లో ఎన్నికల వేడి రాజుకుంది. ఈ నెల 9వ తేదీన జరిగే హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన రాజకీయ పక్షాలు భాజపా, కాంగ్రెస్‌లు పోటీపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి. సిమ్లాలోని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో డజన్ల కొద్దీ యువత కూర్చుని ఓటర్లకు ఫోన్లు చేస్తూ... భాజపాకు ఓటు వేయాల్సిన ఆవశ్యతను వివరిస్తున్నారు. ఆ కార్యాలయం ప్రస్తుతం ఓ వ్యూహ గదిలాగా పనిచేస్తోంది. భాజపా తరఫున ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ త్వరలో రాష్ట్రానికి రానున్నారు. కాంగ్రెస్‌ దిగ్గజం, ప్రస్తుత ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌ ఒక్కరే ఆ పార్టీకి ప్రధాన దిక్కై ప్రచారాన్ని నిర్వహిస్తుండడంతో అక్కడ అంతటి వూపు కనిపించడం లేదు. సిమ్లా మాల్‌ రోడ్డులోని కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలో ఒకింత నిర్లిప్త వాతావరణం కనిపిస్తోంది. వీరభద్రసింగ్‌(83) ఆరుసార్లు హిమాచల్‌ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1980లలో ఒకమారు వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 1993 నుంచి వీరభద్రసింగ్‌ లేదా భాజపా తరఫున ప్రేమ్‌కుమార్‌ ధుమాల్‌(73) ఒకరి తర్వాత ఒకరు సీఎం అవుతున్నారు. ఇప్పుడూ అదే పరిస్థితి కొనసాగితే భాజపా ఈ సారి అధికారంలోకి రావాలి. అందుకే ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోకుండా.. అధికారాన్ని చేజిక్కించుకోవడానికి భాజపా సర్వశక్తులొడ్డుతోంది.