logo

ఇటు సీనియర్‌.. అటు జూనియర్‌!దిల్లీ: జహీర్‌ ఖాన్‌.. భారత పేస్‌ బాధ్యతల్ని దశాబ్దానికి పైగా మోసిన బౌలర్‌. భువనేశ్వర్‌.. జహీర్‌ నిష్క్రమించే సమయంలో భారత జట్టులోకి వచ్చి, ఇప్పుడు ప్రధాన పేసర్‌గా కొనసాగుతున్న కుర్రాడు. ఆ సీనియర్‌, ఈ జూనియర్‌.. ఒకే రోజు వేర్వేరు చోట్ల తమ తమ జీవిత భాగస్వాముల్ని పెళ్లి చేసుకోవడం విశేషం. కొన్నేళ్లు బాలీవుడ్‌ నటి సాగరిక ఘటెతో ప్రేమలో ఉన్న జహీర్‌.. గురువారం ముంబయిలోని ఓ కోర్టు ప్రాంగణంలో సన్నిహితుల మధ్య రిజిస్టర్‌ పెళ్లి చేసుకున్నారు. ఈ నెల 27న వీరి వివాహ విందు ముంబయిలోనే జరగనుంది. మరోవైపు భువనేశ్వర్‌ కూడా గురువారమే తన ప్రేయసి నుపూర్‌ను నాగ్‌పూర్‌లో పెళ్లాడాడు. ఈ పెళ్లి సంప్రదాయ పద్ధతిలో ఘనంగా జరిగింది.