logo

ఏమవుతుందో.. ఏమనుకొంటారో!



సినిమాల్లోకి వచ్చాక సాహసాలు చేయడం అలవాటైపోయిందని చెబుతోంది శ్రుతిహాసన్‌. కెరీర్‌ పరంగా ఇదివరకటితో పోలిస్తే ఆమె జోరు బాగా తగ్గింది. మళ్లీ సత్తా చాటేందుకు కొత్త ప్రణాళికల్ని సిద్ధం చేసుకొంటోంది. ఆ క్రమంలో అందం పరంగా చాలా జాగ్రత్తలే తీసుకొంటోంది. కాస్త బొద్దుగా మారి, సరి కొత్తగా కనిపిస్తోంది. సినిమా రంగంలోకి వచ్చాక మీలో మీకు కనిపించిన ఓ ప్రధానమైన మార్పు ఏంటని అడిగితే... ‘సాహసాలు చేయడం’ అని సమాధానమిచ్చింది. ‘‘మొదట్లో కాస్త ఎత్తయిన ప్రదేశాలంటేనే భయంగా అనిపించేది. కానీ సినిమాల్లోకి వచ్చాక ఆ భయం పోయింది. సెట్లో ఎలాంటి సవాళ్లు ఎదురైనా వాటి గురించి పెద్దగా భయపడను. ఆ ప్రభావం పాత్రల ఎంపికలోనూ కనిపిస్తోంది. ఈ పాత్ర చేస్తే ఏమవుతుందో, ఏమనుకొంటారో అని ఎక్కువగా ఆలోచించను. నచ్చిందా, ఇక చేసేయడమే అన్నట్టుగా ఉంటుంది నా వాలకం. ఆ విషయంలో నాకు స్ఫూర్తి అంటూ ఎవ్వరూ లేరు. మనల్ని మనం నమ్ముకోవడంలో ఉన్నంత సౌకర్యం మరొకటి ఉండదు. అందుకే నాకు నేనుగా నిర్ణయాలు తీసుకొంటా, మంచో చెడో నేనే చూసుకొంటా’’ అని సెలవిచ్చింది శ్రుతిహాసన్‌.