logo

కొత్తతరం ప్రేమకథ



సుధీర్‌బాబు కథానాయకుడిగా శ్రీదేవి మూవీస్‌ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కబోతోంది. బాలీవుడ్‌ భామ, మణిరత్నం ‘చెలియా’తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన అదితీరావ్‌ హైదరీ కథానాయికగా నటిస్తోంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహిస్తారు. శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మాత. డిసెంబరు రెండో వారం నుంచి చిత్రీకరణ మొదలవుతుంది. దర్శకుడు మాట్లాడుతూ ‘‘కొత్త తరం ప్రేమకథా చిత్రమిది. అనూహ్యమైన కథాంశంతో, ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘మోహనకృష్ణ ఇంద్రగంటితో విజయవంతమైన ‘జెంటిల్‌మేన్‌’ తర్వాత మేం నిర్మిస్తున్న చిత్రమిది. ఏప్రిల్‌లో విడుదల చేస్తాం’’ అన్నారు. వరుసగా నాలుగు సినిమాలు: మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్న చిత్రంతోపాటు, కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని కొత్తగా నాలుగు సినిమాల్ని ప్రకటించారు సుధీర్‌బాబు. ఇంద్రసేన అనే కొత్త దర్శకుడితో సోషియో థ్రిల్లర్‌ చేస్తున్నానని ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. అలాగే రాజశేఖర్‌ అనే దర్శకుడితో తండ్రితో అనుబంధం నేపథ్యంలో భావోద్వేగాలతో కూడిన ఓ ప్రేమకథలో నటిస్తున్నానని, ఆ సినిమా సొంత సంస్థ సుధీర్‌బాబు ప్రొడక్షన్‌లో తెరకెక్కుతున్నట్టు తెలిపారు. అలాగే హర్షవర్ధన్‌ దర్శకత్వంలో యు.ఎస్‌.ఎ.లోనే చిత్రీకరించబోతున్న లవ్‌ థ్రిల్లర్‌ సినిమాతో పాటు, ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ త్వరలోనే వెల్లడించబోతున్న ద్విభాషా చిత్రం కూడా చేయబోతున్నట్టు ప్రకటించారు. ‘‘ప్రతీ కథ కొత్తగా ఉంటుందని, ప్రేక్షకుల అంచనాల్ని అందుకొనేలా ఆ చిత్రాలు తెరకెక్కబోతున్నాయ’’ని ట్వీటారు సుధీర్‌బాబు.