logo

అనుష్క గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారా? 

హైదరాబాద్‌: ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ తర్వాత అనుష్క ‘భాగమతి’ చిత్రంలో నటించారు. జి. అశోక్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ ఇటీవల పూర్తైంది. ఈ చిత్రం తర్వాత అనుష్క తన కొత్త ప్రాజెక్టును ప్రకటించలేదు. ప్రభాస్‌ ‘సాహో’ చిత్రం కోసం దర్శక, నిర్మాతలు అనుష్కను కలిసినట్లు గతంలో వదంతులు వచ్చాయి. అయితే ఆ తర్వాత బాలీవుడ్‌ నటి శ్రద్ధాకపూర్‌ ఆ పాత్రలో నటిస్తున్నారని చిత్ర బృందం ప్రకటించింది. అనుష్క కొత్త సినిమాకు సంబంధించి తాజాగా ఓ ప్రచారం జరుగుతోంది. ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో ఆమె నటించే అవకాశాలు ఉన్నట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. గౌతమ్‌ ప్రస్తుతం విక్రమ్‌ హీరోగా ‘ధ్రువ నక్షత్రం’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీని తర్వాతి చిత్రానికి గౌతమ్‌ సన్నాహాలు మొదలు పెట్టారట. ఇందులో పాత్ర కోసం నిర్మాతలు అనుష్కను కలిసినట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట. ఇందులో మరికొందరు అగ్ర నటీనటులు నటించనున్నట్లు చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఉన్ని ముకుందన్‌, జయరాం, ఆది పినిశెట్టి, ఆశా శరత్‌ తదితరులు ‘భాగమతి’లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. డిసెంబరులో ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. 2018లో చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో అనుష్క రెండు పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం.